మొత్తం నవ గ్రహకూటమిలో రాహు, కేతువులు కాకుండా మిగిలిన 7 గ్రహాలన్నీ ఆ రెండు గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్ప దోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి ఈ దోషం కలుగుతుంది. అయితే దోషం మాట వాస్తవమే గానీ దీంతో ఎప్పుడూ చెడు ఫలితాలు కలగవట. కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయట. అంతెందుకు, ధీరూభాయ్ అంబానీ, సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్, జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులకు కాలసర్ప దోషం ఉండేదట. కానీ నిజానికి చూస్తే వారు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. చాలా పేరు తెచ్చుకున్నారు. కీర్తి గడించారు. ఈ క్రమంలో కాలసర్ప దోషం ఉన్నా అంతగా భయపడాల్సిన పనిలేదని పలువురు పండితులు చెబుతున్నారు. కష్టపడి పని చేసే వారికి ఆ దోషం ఉండదని, జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడతారని వారు చెబుతున్నారు.
కాలసర్ప దోషం ఉన్నవారు పనిలో అంకిత భావంతో ఉంటారట. ధైర్యం, నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే అలాంటి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడతాయట.
- కాలసర్ప దోషం ఉన్నవారికి అనుకూలంగా ఉండే గ్రహాలు కూటమిలోకి వచ్చినప్పుడు వారి దశ తిరుగుతుందట.
- కాలసర్ప దోషం ఉన్న వారి జాతక చక్రంలో సూర్యుడు రాహువుతో కలసి 1, 2, 3, 10 స్థానాల్లో ఉంటే అప్పుడు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. వారు కోరుకున్నవి నెరవేరుతాయట. వారి ఆరోగ్యం బాగు పడడమే కాదు, సంపద కూడా వృద్ధి చెందుతుందట. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయట. రాజకీయాల్లో రాణిస్తారట.
- కాలసర్ప దోషం ఉన్న వారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉన్నా లేదంటే రాహువుతో కలసి ఉన్నా అలాంటి వారి జీవితం మారిపోతుందట. వారు అత్యంత ప్రతిభావంతులవుతారట.
- అదేవిధంగా కుజ గ్రహం కాలసర్పం నోటి వద్ద ఉంటే అలాంటి వ్యక్తులు మిక్కిలి ధైర్యవంతులుగా ఉంటారట. అదే ఆ స్థానంలో బుధ గ్రహం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా తయారవుతారట. వారు జీవితంలో ప్రతి మెట్టుకు విజయం సాధిస్తారట.