వచ్చే సంవత్సరం జనవరి 27న మౌని అమావాస్య చాలా ప్రమాదకరమైనదని, అందువల్ల ఆ రోజు అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్కుడు, సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలిపారు. ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారని చెప్పారు. అయితే వచ్చే జనవరి 27న రానున్న మౌని అమావాస్య, ఏటా వచ్చే అమావాస్యలా కాకుండా చాలా సమస్యలతో కూడిందని పేర్కొన్నారు. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని సూచించారు. అంతేసేపు మాట్లాడకుండా ఉండలేని వారు ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.
ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్ 26న సహజ గమనంతో ధనస్సు రాశిలోకి ప్రవేశించవలసి ఉందని, కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గేయ చెప్పారు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్ 21వ తేదీకి చేరుకుంటుందని తెలిపారు. వృశ్చికరాశిలో కొంతకాలంపాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందన్నారు. అందువల్ల 2017వ సంవత్సరం అంత శుభప్రదమైనది కాదని, అందువల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.