మహాభారతానికి చెందిన అనేక కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. అందులో ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామకు చెందిన కథ కూడా ఉంది. అయితే నిజానికి అశ్వత్థాముడు మరణం అంటూ లేని చిరంజీవి అట. అలా అని అతనికి వరం ఉంది. ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు కూడా. అయితే ఆ యుద్ధంలో పాండవులు గెలిచాక అశ్వత్థామ పారిపోయి ఓ ప్రదేశంలో ఉంటాడట. అదే ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..? గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. దాని పేరు చెవదన. అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దెయ్యం రూపంలో తిరుగుతూ ఉంటాడట. ఈ క్రమంలో కొందరు అతన్ని చూసినట్టు కూడా చరిత్ర చెబుతోంది. అయితే అసలు అశ్వత్థామ అక్కడ అలా ఎందుకు ఉన్నాడో, అతనికి ఉన్న శాపం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..?
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరూ తలపడుతారు. ఈ క్రమంలో ఇరువురూ ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు. అయితే అవి రెండూ కలిస్తే ప్రళయం వస్తుందని రుషులు హెచ్చరించడంతో అర్జునుడు తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు. దీంతో ఆ బ్రహ్మాస్త్రానికి కచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడంటే దాన్ని పాండవ స్త్రీల గర్భాల మీదకు వదులుతాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంటుంది. ఆమె అభిమన్యుడి భార్య. ఆ సమయంలో ఉత్తర గర్భంతో ఉంటుంది. ఆమె కడుపులో పరీక్షిత్తు ఉంటాడు. అయితే బ్రహ్మాస్త్రం కారణంగా పరీక్షిత్తు మృతి చెందుతాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో చనిపోయిన శిశువును మళ్లీ బతికిస్తాడు. ఈ క్రమంలో కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడు. కలియుగం అంతం అయ్యే వరకు 6వేల సంవత్సరాల పాటు దెయ్యంగా తిరగాలని, దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఒకే ప్రాంతంలో ఉండాలని, అనేక రోగాలతో బాధ పడాలని శాపం పెడతాడు. ఆ ప్రకారంగానే అశ్వత్థామ ఇప్పటికీ పైన చెప్పిన చెవదన అనే ప్రాంతంలో నిత్యం తిరుగుతూ ఉంటాడట. చేతిలో కాగడాతో తిరుగుతూ దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఉంటాడట.
అయితే పైన చెప్పిందాంతో పాటు అశ్వత్థామ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… సదరు చెవదన అనే ప్రాంతంలో ఒకప్పుడు భీముడికి, అశ్వత్థామకు పెద్ద యుద్ధం జరగ్గా భీముడి గద దెబ్బకు ఆ ప్రాంతంలో పెద్ద కొలను ఏర్పడుతుందట. అది ఇప్పటికీ ఉందట. దాన్ని భీమ్‌కుండ్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని అసిర్‌ఘడ్ అనే ఓ కోటలో సుమారు 5వేల ఏళ్ల కిందట అశ్వత్థామ నివసించే వాడని, అక్కడ ఉన్న శివాలయంలో అతను పూజలు చేసే వాడని చరిత్ర చెబుతోంది. అక్కడ మహమ్మద్ జహీర్ అనే ఓ ముస్లిం వ్యక్తి ప్రస్తుతం గుడిని శుభ్రం చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆ గుడి ఉన్న కోట ఇప్పుడు టూరిస్టు ప్రదేశంగా మారింది. అయితే ముందే చెప్పాం కదా, అశ్వత్థామకు మరణం లేదని, కేవలం కలియుగం అంతమైనప్పుడే అతను మరణిస్తాడని. అవును, అయితే… అశ్వత్థామకు చెందింన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… అతని నుదుటన ఎప్పుడూ ఓ మణి ఉంటుందట. అది అతనికి పుట్టుకతోనే వచ్చిందట..!