News and Entertainment

అల్లు అర్జున్ 200 కోట్లు.. ప్రభాస్ 150 కోట్లు.. ఆ కమెడియన్ రెమ్యూనరేషన్ 195 కోట్లు..!

 


క్రేజ్ ఉంటే ఈరోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ఈజీ అనేది చాలామంది చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా హీరోలు ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నారు. ఒకవైపు ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది అంటారు.. మరోవైపు వాళ్లకు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉన్నారు. ఒక్కో సినిమా కోసం రెండు మూడేళ్లు కష్టపడతారు కాబట్టి వందల కోట్లు తీసుకోవడంలో తప్పులేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కమెడియన్ కేవలం ఒక షో చేసి దేశంలో ఉన్న సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇంకా చెప్పాలంటే కేవలం ఏడాది గ్యాప్ లో 195 కోట్లు సంపాదించి చాలామందికి అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయాడు. అంతగా దుమ్ము దులిపేస్తున్న ఆ కమెడియన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ది వన్ అండ్ ఓన్లీ కపిల్ శర్మ. స్మాల్ స్క్రీన్ మీద ఈయనకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టి ఎంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కపిల్ శర్మ షోలో పాల్గొనాలని ఆశ పడుతుంటారు.

ఒక్కసారి ఆయన షోకు వస్తే మొత్తం పాపులర్ అవుతాం అనే నమ్మకాన్ని కలిగించాడు కపిల్. అందుకే ఆయనకు అంత డిమాండ్. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్‌ 3తో వచ్చాడు కపిల్ శర్మ. జూన్ 21, 2025న స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా వచ్చాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు తాజా ఎపిసోడ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ షో కోసం కపిల్ శర్మ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. తొలి సీజన్ నుంచే ఒక్కో ఎపిసోడ్‌కు 5 కోట్లు తీసుకుంటున్నాడు కపిల్. 2024 మార్చి 30 నుంచి జూన్ 22 వరకు ప్రసారమైన తొలి సీజన్‌లో మొత్తం 13 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్లు చొప్పున కపిల్ రెమ్యునరేషన్ మొత్తం రూ.65 కోట్లు అన్నమాట. రెండవ సీజన్ కూడా 13 ఎపిసోడ్‌లతో 2024 సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రసారమైంది. ఈ సీజన్ కు కూడా కపిల్ శర్మ 65 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు 3వ సీజన్‌లో కూడా మొత్తం 13 ఎపిసోడ్‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ నుంచి కూడా కపిల్ మరో 65 కోట్లు వెనకేసుకోనున్నాడు. అంటే మూడు సీజన్లు కలిపి కపిల్ శర్మకు ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో నుంచి వచ్చిన మొత్తం ఆదాయం అక్షరాలా 195 కోట్లు.

ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో తొలి సీజన్ 2024 మార్చిలో ప్రారంభమైంది.. అంటే కేవలం 16 నెలల వ్యవధిలో కపిల్ శర్మ ఏకంగా 195 కోట్లు సంపాదించాడు. దేశంలో ఏ స్టార్ హీరో కంటే ఇది తక్కువ సంపాదన కాదు. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కపిల్. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఈయన దాదాపు 200 కోట్లు సంపాదించాడు. అది కూడా ఒక షో చేసి.. నెలలో మహా అయితే ఒక 10 రోజులు షూటింగ్ ఉంటుంది. ఈ లెక్కన 16 నెలల్లో ఆయన షూటింగ్ చేసిన రోజులు మహా అయితే ఒక మూడు నెలలు ఉంటాయి. ఆ షో కోసం ఇంకొక మూడు నెలలు వర్క్ చేశారు అనుకున్నాం. ఎలా చూసుకున్నా కూడా ఆరు నెలల్లోనే ఆయన 200 కోట్లు సంపాదించేసాడు. మన హీరోలు ఒక పాన్ ఇండియా సినిమా చేసి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ దానికోసం వాళ్ళు రెండేళ్లకు పైగానే కష్టపడాలి.. అయితే ఇక్కడ కపిల్ శర్మ మాత్రం 16 నెలల్లో మూడు సీజన్లు కలిపి 39 ఎపిసోడ్స్ కి గాను 195 కోట్లు అందుకుంటున్నాడు. ఈ లెక్కన కపిల్ శర్మ ఆదాయం పాన్ ఇండియా స్టార్లని మించిపోయింది. ఇదే షోలో కపిల్‌తో పాటు ఉన్న అర్చన పూరన్ సింగ్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.10 నుండి 12 లక్షలు.. ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.25 లక్షలు.. కికూ శార్దా రూ.7 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.