శివుడు ఒకప్పుడు దిగంబరుడే. ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించేవాడు కాదు. అయితే ఒకానొక సమయంలో శివుడు అరణ్యంలో వెళ్తున్నప్పుడు దిగంబరుడిగా ఉన్న ఆయన తేజస్సును చూసి రుషులు, మహర్షులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారట. ఆయన ముఖంలోని వెలుగుని చూసి ఆయన పట్ల ఆకర్షితులవుతారట. అనంతరం శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆయన్నే తలచుకుంటూ నిత్యం కుటీరాల్లో పనులు కూడా సరిగ్గా చేసేవారు కారట. అయితే వారు అలా ఎందుకు చేస్తున్నారో వారి వారి భర్తలకు తరువాత తెలుస్తుంది. దీంతో శివుడ్ని ఎలాగైనా హతమార్చాలనుకుంటారు. అందులో భాగంగానే వారు ఒక కుటిల ఉపాయం చేస్తారు.
శివుడు రోజూ వచ్చే దారిలో పెద్ద గుంతను తవ్వి పెడతారు. అందులో తమ మంత్రశక్తితో అత్యంత శక్తివంతమైన పెద్ద పులిని సృష్టించి ఉంచుతారు. అది సరిగ్గా శివుడు వచ్చే సమయానికి ఆయనపై ఒక్కసారిగా భీకర రూపంలో దాడి చేస్తుంది. అయినా శివుడు మహాదేవుడు కదా. ఏ జీవి అయినా ఆయన అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సిందే. దీంతో తనపై దాడికి వస్తున్న పులిని శివుడు చంపేస్తాడు. అనంతరం జరిగిన విషయం తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన అంగవస్త్రంగా కట్టుకుంటాడు. అప్పటి నుంచి శివుడు ఆ పులి చర్మాన్నే ధరిస్తూ వస్తున్నాడు. ఇదీ… శివుడు పులి చర్మాన్ని ధరించడం వెనుక ఉన్న అసలు కారణం. దీని గురించి శివపురాణంలో వివరించారు..!