నెట్వర్క్ దిగ్గజం గూగుల్ మేనేజర్‌పై కిరాతకులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా మహిళలకు ఎక్కడా రక్షణ లేదని నిరూపించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా అనంతరం ఆమెను సజీవ దహనం చేశారు. పురుషులతో సమానంగా అంతకు మించి ఎక్కువగానే దూసుకుపోతున్నా.. రక్షణ లేని సమాజంలో మహిళలు క్షణక్షణం మాన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. తాజాగా అమెరికాలో వెలుగు చూసిన గూగుల్ మేనేజర్ ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఇంతటి ఘోరం మరే ఆడపడుచుకి రాకూడదని కోరుకుంది.
గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో వనెస్సా మార్కోటీ (27) అనే యువతి అకౌంట్స్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె తన తల్లిని చూసి, పరామర్శించేందుకు ఆదివారం న్యూయార్క్ నుంచి బయలు దేరారు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లికి ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో తన కుమార్తె రాకకోసం ఆ తల్లి వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. అయితే ఆమె బయలు దేరి గంటలు గడిచినా ఇంకా రాకపోయేసరికి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. ఓ గంట లేటైనా వస్తుందిలే అని మార్కోటీ కోసం ఎదురు చూసింది. అలా ఎదురు చూస్తూనే సాయంత్రం అయిపోయింది. ఇంటికి వస్తానని చెప్పిన కుమార్తె రాకపోగా, ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మార్కోటీ తల్లి పోలీసులను ఆశ్రయించింది.
జాగిలాలతో రంగంలోకి దిగిన పోలీసులు మార్కోటీ తల్లి చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు ఓ భయంకర నిజాన్ని గుర్తించారు. రోడ్డు పక్కన పొదల్లో.. సగానికిపైగా కాలిపోయిన మృతదేహం వారికి దొరికింది. ఒంటిపై దుస్తులు కూడా లేని స్థితిలో ఉన్న మృతదేహం, కాళ్లపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. హుటా హుటీన మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగిందని నిర్దారించారు. ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో అమెరికా సహా ప్రపంచం నివ్వెరపోయింది. మహిళల కోసం ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. ఆ మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన దేశాల పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు.
loading...

