ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నా మొడపై కత్తిపెట్టినా భారత్ మాతాకు జై అనను అని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ సంఘటనను అందరూ మర్చిపోతున్న సమయంలో రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ”భారత్ మాతాకీ జై” అని అందరూ అనాలని రాజ్యంగంలో ఎక్కడైనా ఉందా? నా గొంతుపై కత్తి పెట్టినా కూడా నేనా నినాదం చేయబోనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
యోగా గురు బాబా రాందేవ్ దానిపై మరోసారి దుమారం రేపారు. అసద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన ‘భారత్ మాతాకీ జై” అనని వారి తలలను తాను నరికేసేవాడినని.. కానీ చట్టాలపై గౌరవంతో ఆ పనిచేయడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటువంటి వ్యాఖ్యలు ఎన్ని వేల మంది చేసినా.. వారందరిని నరికేస్తానన్నట్లుగా ఆయన మాట్లాడారు. భారత్ మాతాకీ జై అనడానికి వ్యతిరేకిస్తున్నవారంతా సిగ్గు పడాలన్నారు.
ప్రతి ఒక్కరు మాతృదేశాన్ని గౌరవించాలని సూచించారు. కాగా కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదం దేశంలో పెద్ద దుమారమే రేపింది. పార్లమెంటులోనూ దీనిపై పెద్ద చర్చే జరిగింది. దేశంలోని బడా నేతలు మతగురువులు ఇప్పటికే స్పందించారు. భారత్ మాతాకీ జై అనడానికి ఇష్టపడని అసదుద్దీన్ పై చాలామంది విరుచుకుపడ్డారు. కాస్త ఆలస్యంగా స్పందించిన రాందేవ్ ఆవేశంగా స్పందించి మరోసారి వార్తల్లో కెక్కారు.
