బాహుబలి 2 హైలెట్స్ చెప్పిన రాజమౌళిబాహుబలి సినిమా చూశాక బాహుబలి-2 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు రాజమౌళి బాహుబలి అంచనాలను మించి హిట్ అవ్వడంతో బాహుబలి 2ను మరింత కాన్సంట్రేషన్తో తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి బాహుబలి 2 2016లో రిలీజ్ కావాల్సి ఉండగా మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తుండడంతో 2017 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘బాహుబలి: ది బిగినింగ్’ కంటే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకా భారీగా ఉంటుందని.. ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేని విధంగా ఉంటుందని చెప్పడం విశేషం.
ఇక బాహుబలి -2 గురించి రాజమౌళి చెపుతూ బాహుబలిలో పాత్రల పరిచయమే సరిపోయిందని అసలు స్టోరీ బాహుబలి -2లోనే ఉంటుందని చెప్పాడు. విజువల్ ఎఫెక్టులు.. యుద్ధ సన్నివేశాలు తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయి. రెండో పార్ట్‌లో ఎమోషనల్ సీన్లు వీటన్నింటికంటే సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయన్నదే తన నమ్మకమని రాజమౌళి చెప్పాడు.
బాహుబలి-శివగామి.. బాహుబలి-దేవసేన.. బాహుబలి-భల్లాలదేవ.. భల్లాలదేవ-దేవసేన.. ఇలా పాత్రల మధ్య ఏం జరిగింది.. ఆయా పాత్రల మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రధానంగా రెండో భాగంలో చూపిస్తాం. అలాగే 2015 సంవత్సరానికి అతి పెద్ద ప్రశ్నగా మిగిలిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు కూడా బాహుబలి -2లో సమాధానం ఉంటుందని రాజమౌళి తెలిపాడు.
