టాలీవుడ్ లో బ్రహ్మానందం అంటే ఓ బ్రాండ్ ఆయన తెరపై కనిపిస్తే చాలు కొన్ని సినిమాల్లో హీరో కంటే ఎక్కువ విజిల్స్ పడతాయి. అదీ బ్రహ్మానందం క్రేజ్. రెండు దశాబ్దాల నుంచి బ్రహ్మీ ప్రస్థానం ఎదురులేకుండా సాగుతుంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాడు బ్రహ్మానందం.
కేవలం ఆయన అప్పియరెన్స్ తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు బ్రహ్మీ ఉంటేనే సినిమా.. కానీ ఇప్పుడు బ్రహ్మీ ఆ స్థాయిలో మాయ చేయలేకపోతున్నాడు. ఇప్పుడిప్పుడే ఈయనకు కష్టకాలం మొదలైనట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఆన్ సెట్స్ లో దర్శకనిర్మాతల్ని ఇబ్బంది పెడతాడనే రూమర్ మనోడిపై ఉంది.
పెద్ద సినిమాలకేమో గానీ తన బొమ్మేసుకుని నడిపించుకునే చిన్న సినిమాల విషయంలో బ్రహ్మీ ఆడిందే ఆట.. పాడిందే పాట అంటుంటారు ఫిల్మ్ నగర్ జనాలు. కానీ ఇండస్ట్రీలో బ్యాడ్ టైమ్ అనేది ప్రతీ ఒక్కరికి వస్తుంటుంది. ఇప్పుడు బ్రహ్మానందానికి కూడా అదే వచ్చినట్లు కనిపిస్తుంది. కొత్త కమెడియన్ల రాక.. ఎమ్మెస్ నారాయణ లాంటి సీనియర్ల పోక.. బ్రహ్మీ కెరీర్ కు అడ్డంకిగా మారింది. ఇక ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు చెప్పుకోదగ్గ పాత్రలు కూడా రాలేదు.
రేసుగుర్రం తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెటర్. అఖిల్, సౌఖ్యం లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇలాంటి టైమ్ లో బ్రహ్మీ కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఇందులో బ్రహ్మీకి ఓ కీ రోల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
ట్రైలర్ లోనూ బ్రహ్మీ స్టైల్ చూసి పవన్ నవ్వుకున్నాడు. మరి సినిమాలోనూ నవ్విస్తే బ్రహ్మానందం కెరీర్ మరింత కాలం ముందుకెళ్తుంది. బ్రహ్మీని కాపాడిన సినిమా సర్దార్ అవుతుంది. లేకుంటే ఈ ఖాన్ దాదా పరిస్థితి మరింత దిగజారుతుందనడంలో సందేహం లేదు.
