News and Entertainment

బ్రేకింగ్ న్యూస్: చిరు, పవన్‌ల మల్టీస్టారర్‌ మూవీ అధికారిక ప్రకటన

loading...

మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లను కలిపి స్క్రీన్‌పై చూడాలని మెగా ఫ్యాన్స్‌ ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నారు. వీరిద్దరు కలిసి నటించడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకుంటున్న సమయంలో కల నిజమవ్వబోతుంది. ఈ మెగా బ్రదర్స్‌కు కలయికలో సినిమా రాబోతుంది. రాజ్యసభ సభ్యుడు, నిర్మాత అయిన టి సుబ్బిరామిరెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో తాను ఒక సినిమా నిర్మించబోతున్నట్లుగా సుబ్బిరామిరెడ్డి ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు లేకుండా పోయింది.

ఈ మెగా మల్టీస్టారర్‌కు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్‌కు స్టోరీ సిద్దం చేయాల్సిందిగా చెప్పానని, ఆయన ఆ పనిని కూడా మొదలు పెట్టినట్లుగా సుబ్బిరామిరెడ్డి ప్రకటించాడు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌తో కలిసి నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సుబ్బిరామిరెడ్డి ప్రకటన వెలువడిన వెంటనే మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. కల సాకారం చేయబోతున్నందుకు సుబ్బిరామిరెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సినిమాను ప్రకటించినందుకు సుబ్బిరామిరెడ్డికి అభినందనలు భారీగా వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు అడిగిన వెంటనే ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞలు అంటూ సుబ్బిరామి రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని సుబ్బిరామిరెడ్డి 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.