News and Entertainment

గూగుల్ CEO సుంద‌ర్ పిచాయ్‌కు జాబ్ కావాలని లేఖ రాసిన చిన్నారి..!


సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి అంద‌రికీ తెలిసిందే. అందులో ప‌నిచేయాల‌ని ప్రతి సాఫ్ట్ వేర్ ఉద్యోగి క‌ల‌లు కంటాడు. కానీ… ఆ అదృష్టం కొంద‌రినే వ‌రిస్తుంది. అవును మ‌రి… గూగుల్‌లో జాబ్ అంటే మాట‌లు కాదు. ఎన్నో క‌ఠినమైన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అప్పుడు గానీ… జాబ్ లెట‌ర్ చేతికి రాదు. అయితే… ఇవేవీ తెలియ‌ని ఓ చిన్నారి త‌న‌కు గూగుల్ లో జాబ్ చేయాల‌నుంద‌ని ఏకంగా ఆ సంస్థ సీఈవో సుంద‌ర్ పిచాయ్ కే లెట‌ర్ రాసింది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి అందుకు పిచాయ్ రిప్లై ఇచ్చారా..? అంటే… ఇచ్చారు..! ఇంత‌కీ అస‌లు విష‌య‌మేంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!


ఆ చిన్నారి పేరు క్లో బ్రిడ్జ్ వాట‌ర్‌. ఉంటోంది యూకేలోని హియ‌ర్‌ఫోర్డ్‌లో. వ‌య‌స్సు 7 సంవ‌త్స‌రాలు. అయితే ఆ చిన్నారికి ఈ మ‌ధ్యే ఓ ఆలోచ‌న వ‌చ్చింది. వెంట‌నే వెళ్లి దాని గురించి తండ్రిని అడిగింది. తాను పెద్ద‌య్యాక ఎక్క‌డ జాబ్ చేస్తే బాగుంటుంది అని ఆమె తండ్రిని అడ‌గ్గా, అందుకు అత‌ను గూగుల్ అని చెప్పాడు. గూగుల్‌లో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి మంచి జీతం ఉంటుంద‌ని, అంతేకాదు, రిలాక్స్ అయ్యేందుకు ఎంచ‌క్కా ఆఫీస్‌లోనే బీన్ బ్యాగ్స్‌, గోకార్ట్స్‌, స్లైడ్స్ ఉంటాయ‌ని చెప్పాడు. దీంతో బ్రిడ్జ్ వాట‌ర్‌కు ఎలాగైనా గూగుల్‌లో ప‌నిచేయాల‌ని ఆస‌క్తి క‌లిగింది. అయితే వెంట‌నే తండ్రికి ఆ విష‌యం చెప్ప‌గానే అత‌ను… ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే గూగుల్‌లో జాబ్ చేసేందుకు ద‌ర‌ఖాస్తు పెట్టుకో… అని చెప్పాడు. దీంతో ఆ చిన్నారి స్వ‌యంగా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు లేఖ రాసింది. త‌న‌కు కంప్యూట‌ర్లు, రోబోటిక్స్‌, టెక్నాల‌జీ అంటే ఇష్ట‌మ‌ని, అందుక‌ని గూగుల్‌లో జాబ్ చేస్తాన‌ని ఆ లెట‌ర్‌లో పేర్కొంది.

అయితే క్లో బ్రిడ్జ్ వాట‌ర్ లెట‌ర్ అయితే రాసింది కానీ, దానికి రిప్లై వ‌స్తుంద‌ని అనుకోలేదు. కానీ… అనుకోకుండానే ఆ లెట‌ర్‌కు రిప్లై రానే వ‌చ్చింది. సుంద‌ర్ పిచాయ్ స్వ‌యంగా ఆ చిన్నారి లేఖ‌కు రిప్లై లెట‌ర్ రాశాడు. గూగుల్‌లో జాబ్ చేయాల‌ని ఉంది, అన్నందుకు సంతోషిస్తున్నా. నీ క‌ల నెర‌వేరాల‌ని ఆశిస్తున్నా. నీ విద్యాభ్యాసం మొత్తం పూర్త‌య్యాక గూగుల్ జాబ్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకో. నీ అప్లికేష‌న్ కోసం ఎదురు చూస్తూ ఉంటా… అని పిచాయ్ స‌మాధానం ఇచ్చారు. దీంతో ఆ లెట‌ర్‌ను అందుకున్న క్లో తండ్రి దాన్ని త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ లెట‌ర్ సోష‌ల్ సైట్ల‌లో ట్రెండింగ్ అవుతోంది. ఏది ఏమైనా… క్లో లాంటి చిన్నారికి చిన్న‌ప్ప‌టి నుంచే అలాంటి ఉన్న‌త ల‌క్ష్యం ఏర్ప‌డినందుకు ఆమెను మనం అభినందించాల్సిందే క‌దా..!