News and Entertainment

కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారో తెలుసా ?


దేవుడి గురించి విన్నప్పుడల్లా ప్రాపంచిక వ్యవహారాల్లో కనపడే సింపుల్ లాజిక్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంటుంది. దేవుళ్లలో సూపర్ స్టార్ గా అనిపించే కృష్ణుడు గురించే తీసుకుందాం. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు, అంటే దేవుడైన కృష్ణుడు కూడా క్రెడిట్ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేసాడా ? నన్ను నమ్ముకో నీకే కష్టం ఉండదు అని చెప్పిన వ్యక్తి , ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ? ఇలాంటి ప్రశ్నలే మీకు ఉన్నాయా…అయితే ఈ సంభాషణ చూడండి

శ్రీ కృష్ణుడికి ఓ క్లోజ్ ఫ్రెండ్ కం భీభత్సమైన భక్తుడు ఒకడు ఉన్నాడండీ, అతనే ఉద్దవుడు. ఉద్ధవుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఉద్ధవుడికి కూడా ఇవే ప్రశ్నలు తొలిచేస్తూ ఉండేవి. అడుగుదామా వద్దా అని ఆలోచిస్తుంటే, ఒక రోజు కృష్ణుడే వచ్చి

కృష్ణ : నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది, ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమి అడగలేదు, ఏమైనా ఉంటె అడుగు మళ్ళీ దొరకను.

ఉద్దవ : కృష్ణా నాకు ఎటువంటి కోరికలు లేవు కాని కొన్ని సందేహాలు ఉన్నాయి, అనుమతిస్తే నివృత్తి చేసుకుంటాను.
కృష్ణ : తప్పకుండా మిత్రమా, అడుగు…

ఉద్దవ : నిజమైన స్నేహితుడు అంటే ఎవరు ?
కృష్ణ : నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నీ పిలుపు కోసం ఎదురుచూడకుండా వచ్చి సాయం చేసేవాడు.

ఉద్దవ : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?
కృష్ణ : ఉద్దవా! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధనమన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటె రాకుండా ఉంటానా.


ఉద్దవ : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?
కృష్ణ : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మ ని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీది గమనిస్తూ ఉంటాను.

ఉద్దవ : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?
కృష్ణ : ఉద్దవా! ఇక్కడే నువ్వు ఓ లాజిక్ మిస్ అవుతున్నావు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి, నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.

అదండీ! విషయం. సూపర్ స్టార్ కృష్ణుడు ఏది వూరికే చేయడు, మన పక్కనే ఉంటాడు. పూజలు గట్రా ఏమి అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు మన లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతుందన్నమాట.

కేవలం ఈ ప్రశ్నలే కాదు, ఇంకా చాలా విషయాల గురించి అడిగాడు ఉద్ధవుడు. భారతంలో అర్జునిడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానం భగవద్గీత అయితే, భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్ధవగీత(హంస గీత)గా ఉంది. మీకు ఆసక్తి ఉంటె ఉద్ధవగీత చదవండి.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి