News and Entertainment

'ఉగాది' పుట్టుక-ప్రాముఖ్యత


ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. 

తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:- చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

"ఉగాది" ఆచరణ విధానం
ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారుడు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నాడు.
తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం... 
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...
ఉగాది రోజు
తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.



(1) తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. "అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌
అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.
ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక: 
అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:
యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.....Next Page