News and Entertainment

మగతనాన్ని పోగొడుతున్న సన్‌స్క్రీన్‌ లోషన్లు





వేసవిలో సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు వాడటం సహజమే. అయితే, ఈ తరహా లోషన్లు వాడుతున్న పురుషులకు తాజా అధ్యాయనం కాస్త ఆందోళన కలిగించే అంశంగా తేల్చింది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించే సన్‌స్క్రీన్‌లతోపాటు, మేకప్‌ లేపనాలు, మోయిశ్చరైజర్లు, పెదాలకు రాసుకునే లిప్‌ బామ్‌లతో ఇబ్బందులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


వాటిలోని రసాయనాలతో మానవ వీర్య కణాల విధులకు అవరోధం ఏర్పర్చవచ్చన్నారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను వడకట్టే కొన్ని సన్‌స్క్రీన్‌ రసాయనాలు వీర్య కణాల పనితీరులో జోక్యం చేసుకుంటాయని పరిశోధకులు తెలిపారు.


కొన్ని.. ప్రొజెస్టారాన్‌ అనే స్త్రీ హార్మోన్‌ తరహా ప్రభావాన్ని కలగజేస్తున్నాయని వివరించారు. అమెరికా లేదా ఐరోపాలో అనుమతించిన 31 యూవీ ఫిల్టర్లలో 29 రసాయనాలపై పరిశోధనలు సాగించారు. ఆరోగ్యంగా ఉన్న మానవ వీర్యకణాలపై ఇవి చూపే ప్రభావాన్ని పరిశీలించారు. స్త్రీల ఫాలోపియన్‌ నాళాల్లోని పరిస్థితులను పోలి ఉండే ఒక బఫర్‌ ద్రావకంలో ఉంచి వీర్య కణాలను పరీక్షించారు. క్యాల్షియం అయాన్లు పేరుకుపోవడం వల్ల ఈ వీర్య కణాల్లోని క్యాల్షియం సంకేత తీరులో వచ్చిన మార్పులను పరిశీలించారు. 


క్యాల్షియం అయాన్‌ మార్గాల గుండా ఈ అయాన్లు సాగించే కదలికలు వీర్యకణ పనితీరులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పరిశోధించిన 29 ఫిల్టర్లలో 13 రసాయనాల వల్ల వీర్య కణాల్లో క్యాల్షియం అయాన్ల ఉద్ధృతి పెరిగినట్లు తెలిపారు. తద్వారా ఈ కణాల సాధారణ విధుల్లో అవరోధం ఏర్పడిందని చెప్పారు. అంతుబట్టని సంతానలేమి కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణాన్ని తమ పరిశోధన కొంతమేర వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్త నీల్స్‌ స్కాక్కెబేక్‌ వివరించారు.